తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. గడిచిన రెండున్నరేండ్లలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని స్పష్టం చేశారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4,18,931గా ఉందన్నారు. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందని స్పష్టం చేశారు.

నాలుగు కోట్ల ప్రజలకు భరోసా..

గడిచిన 32 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసిందని తెలిపారు.తమ ప్రభుత్వం సాధించిన విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047 అని స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తమ ప్రభుత్వం గట్టిగా విశ్వశిస్తోందన్నారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్‌ను దాటేసిందని స్పష్టం చేశారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.

న్యాయమైన వాటా దక్కాల్సిందే..

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల్లో సన్నబియ్యం ఓ విప్లవాత్మక పథకం అని కొనియాడారు. 93 లక్షలకు పైగా కుటుంబాలు, దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని తెలిపారు.

తొలి దశలో4.50 లక్షల ఇండ్ల నిర్మాణం..

పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తొలి దశలో4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమల్లోకి తెచ్చామని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వశాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని.. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>