కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈమేరకు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వడగండ్లతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. రాత్రి వేళల్లో ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హాట్ సమ్మర్ లో వానలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలు అకాల వర్షాలతో కాస్త సేద తీరుతున్నారు. అటు అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా పంట వాన నీటిలో తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మంగళవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్‌లో 41.5, జగిత్యాలలో 41.4, ఆదిలాబాద్‌లో 41.2, కామారెడ్డిలో 41.1, నల్లగొండలో 41.1, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, మంచిర్యాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మెదక్, వనపర్తి జిల్లాల్లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. మిగతా జిల్లాల్లో 37 నుంచి 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో (Unseasonal Rains) రైతన్నలు ఆగం అవుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, జనగామ జిల్లాలలోఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచేశాయి. సోమవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలలో అనేక చోట్ల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల వందలాది ఎకరాల్లో వరి పైర్లు నేల వాలాయి. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లాలోని బీమ్ గల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజక వర్గాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి మండలాల్లో వివిధ పంటల నష్టం జరిగింది. ఆర్మూర్ (Armoor) నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. జనగామ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మొక్కజొన్న రాశులు నీట మునిగాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

