కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ అక్కడే ఇళ్లస్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఓపిడిఆర్(OPDR) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, కార్యదర్శి విజయేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రుల ఆదేశాలతో ఎనిమిదేళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదల ఇళ్లను అమానుషంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెలుగుమట్ల (Velugumatla) కాలనీలో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ అక్కడే జీవిస్తున్నారని తెలిపారు. వారి సమస్యలను అర్థం చేసుకోకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. అంతేకాకుండా, తాము డబ్బులు వసూలు చేశామని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
ఫిబ్రవరిలో నిజనిర్దారణ కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. పట్టాలు ఉన్న పేదల్లో భయాందోళనలు తొలగించాలని అప్పుడే సూచించినట్లు తెలిపారు. అయితే, కమిటీ పర్యటన తర్వాత కూడా మంత్రుల ఆదేశాల మేరకు ఇళ్ల కూల్చివేతలు కొనసాగడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజల్లో తీవ్ర విమర్శలు రావడంతో కొంతమందిని ఎంపిక చేసి ఇళ్లు ఇస్తామని చెప్పడం ద్వారా మిగతా అర్హులకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
Read Also: మేడారం ఘటన.. ప్రభుత్వంపై నెటిజన్లు ఫైర్
Follow Us On: Instagram

