Mobile Popup Ad
Mobile Popup Ad

15 రోజుల్లో రామయ్య కళ్యాణం.. చకచకా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం (Bhadrachalam) లో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి సరిగ్గా 15 రోజులే సమయం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే కళ్యాణం వీక్షించడానికి అవసరమైన టికెట్లను ఆన్లైన్లో, ఆఫ్ లైన్ లో సిద్ధంగా ఉంచడం జరిగింది. ఆన్లైన్ ద్వారా సుమారు 11 వేల టికెట్లు, ఆఫ్ లైన్ ద్వారా మరో ఐదు వేల వరకూ టిక్కెట్లు విక్రయించనున్నట్లు దేవస్థానం అధికారులు చెప్తున్నారు. రూ.7500 విలువ చేసే టికెట్‌పై ఇద్దరిని కళ్యాణానికి అనుమతిస్తారు. వీరికి చీర, పంచ, లడ్డు, తలంబ్రాల ప్యాకెట్, రామాయణం పుస్తకం అందివ్వడం జరుగుతుంది. టికెట్ ధరలు రూ.150 నుంచి మొదలుకొని రూ.7500 వరకూ ఉన్నాయి. ధరను బట్టి ఒక్కరికీ లేదా ఇద్దరికీ ప్రవేశంతో పాటు ప్రయోజనాలు ఉంటాయి. భద్రాచలం వరకూ రాలేని వారికి కూడా పూజ జరిపించి ప్రసాదం, తలంబ్రాలు, కండువా, జాకెట్ ముక్క భక్తుల చిరునామాకు పంపించే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు.

భద్రాచలంలో (Bhadrachalam) జరిగే సీతారాముల కళ్యాణానికి ఆకాశమంత పందిరి వేసి భూలోకమంతా పీట వేసి వివాహ క్రతువు జరుపుతారనే, అతిశయోక్తికి ఏమాత్రం తగ్గకుండా, ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా కళ్యాణం కమనీయం అనేలాగా ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ఉగాది పర్వదినాన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 2 వరకూ 15 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ 15 రోజుల్లో 26న జరిగే ఎదుర్కోలు, 27న కళ్యాణం, 28న పట్టాభిషేకం కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. రామాలయంలో రెగ్యులర్ సిబ్బంది 250 మంది ఉన్నారు. వీరందరికీ ఈఓ దామోదర్ రావు బ్రహ్మోత్సవాల బాధ్యతలను ఇప్పటికే అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా కళ్యాణ బాధ్యతలు ఆలయ ప్రధాన అర్చకులు సీతా రామానుజ చార్యులకు అప్పగించారు.

ఈ నెల 27న జరిగే కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే  28న జరిగే మహా పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వీరే కాకుండా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరి కోసం మూడు హెలిప్యాడ్‌లను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.  బందోబస్తుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పటిష్ట చర్యలు చేపట్టారు. దాదాపు 3వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 250 బస్సులను నడపనుంది. ఆర్టీసీ తరపున 600 మంది సిబ్బంది పండగ విధుల్లో పాల్గొననున్నారు. అలాగే బస్టాండ్ నుంచి దేవాలయానికి ఉచిత బస్ సర్వీస్ అందించనున్నారు.

Read Also: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>