మిర్యాలగూడలో 24 గంటల తాగునీరే లక్ష్యం : ఎమ్మెల్యే బీఎల్ఆర్

కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, ప్రతి ఇంటికి 24 గంటల పాటు నాణ్యమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Laxma Reddy) తెలిపారు. పట్టణంలో రూపుదిద్దుకుంటున్న అమృత్ 2.0 పనులను పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు.

పర్యటనలో భాగంగా పెద్ద దేవులపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్న నూతన పంప్ హౌస్, పైప్‌లైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే నేరుగా పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాగునీటి కొరతతో పట్టణ ప్రజలు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలన్నారు.

నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పంప్ హౌస్, పైప్‌లైన్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలోని వివిధ వార్డులలో నిర్మాణం జరుపుకుంటున్న 12 నూతన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ట్యాంకుల నిర్మాణం పూర్తయితే పట్టణవ్యాప్తంగా నిరంతరాయంగా 24 గంటల నీటి సరఫరా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>