పేదల కోసమే పండుగ సాయన్న పోరాటం: వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేదల ఆత్మగౌరం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పండగ సాయన్న (Panduga Sayanna) అంటూ రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు, గౌరవం, అభివృద్ధి కోసం పండుగ సాయన్న చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

సాయన్నతో పాటు చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న గౌడ్, కొమురం భీమ్ వంటి ప్రజానాయకుల సేవలు, పోరాటాలను పాఠ్యాంశాలు, సాహిత్యం, సినిమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి శ్రీహరి అన్నారు. బీసీ కేటగిరీ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రస్తుతం బీసీ-ఏలో ఉన్న వర్గాలకు ఇబ్బంది కలగకుండా ముదిరాజ్ పిల్లలకు తగిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీసీ-జీ కేటగిరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు.

బీసీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు..

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎన్ని అవరోధాలు ఎదురైనా పేదల పక్షాన నిలిచిన పండుగ సాయన్న జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముదిరాజ్‌లతో పాటు మత్స్యకార వృత్తిపై ఆధారపడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ వర్గీకరణపై వస్తున్న అభ్యర్థనలను న్యాయబద్ధంగా పరిశీలించి, విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తామని చెప్పారు.

చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు చేపల పెంపకంతో పాటు కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముదిరాజ్ సోదరులకు, మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>