Mobile Popup Ad
Mobile Popup Ad

‘కొడుకు నుంచి రక్షించండి’.. ప్రజావాణిలో తల్లిదండ్రుల ఫిర్యాదు

కలం, నిజామాబాద్ బ్యూరో : పాలు పెంచి పోషిస్తే కాటు వేసిన చందంగా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఓ కర్కశ కొడుకు కన్న తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ‘కన్న కొడుకు నుంచి ప్రాణహాని ఉందని రక్షించండి’ అంటూ 80 ఏళ్ల తండ్రి 75 ఏళ్ల తల్లి కలెక్టరేట్ కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారంటే వారి బాధ ఆవేదన ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.. వేల్పూర్ మండలం పడిగెల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తమ రెండో కొడుకు మానసిక వేదనకు గురిచేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

80 ఏళ్ల కొండెపు చిన్న బాలయ్యా, అతని భార్య 75 ఏళ్ల కొండ్లెపు రాధలు వృద్ధాప్యంలోనూ వేల్పూర్ లో కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. మాయ మాటలు చెప్పి తమకు తెలియకుండా ఇల్లును అతని వదినపైకి రిజిస్ట్రేషన్ చేయించాడని, అంతేకాకుండా కొడుకు వద్ద దాచుకున్న ఆరు లక్షల యాభై వేల రూపాయలను ఇవ్వమని అడిగితే తమను వృద్ధులమని కూడా చూడకుండా ఇంట్లో బంధించి తీవ్ర చిత్ర హింసలకు గురి చేశాడని కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని గత నెల 16వ తేదీన పోలీస్ కమిషనర్ కు కుల పెద్దలు, రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామన్నారు. అప్పటి నుండి తమను మానసికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. కూలీ పని చేసి చదివించి ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దితే తమను చంపడానికి సిద్ధమయ్యాడని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు నుండి రక్షణ కల్పిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వేల్పూరు పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>