కలం, ఖమ్మం బ్యూరో: భారీ వర్షాలు, వరదలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సేవలు మరువలేనివని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రశంసించారు. బేతుపల్లి చెరువు ఉప్పొంగిన ప్రాంతంతో పాటు దమ్మపేట మండలంలోని పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడా వెనకడుగు వేయకుండా తక్షణమే స్పందించి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లు అద్భుతమని కొనియాడారు.
గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి పొంగులేటి సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్ద చెరువు వద్ద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దమ్మపేట మండలంలో మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద గండ్లు పడిన ప్రాంతాలను సందర్శించి వరద ఉధృతిని, సహాయక చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం ఎంతో గొప్పవని మంత్రి అన్నారు. విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన తెగువను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేశాయని, విపత్తు వేళ వారి సేవలు మరువలేనివని ప్రభుత్వం తరఫున మరోసారి అభినందనలు తెలిపారు.

