కలం, వరంగల్ బ్యూరో: మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా 63 ఏళ్ల వయసులో ఓ మహిళ సాహసోపేత సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భీమవరానికి చెందిన ఇందుపూరి విజయలక్ష్మి (Indupuri Vijayalakshmi) .. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం భీమవరం నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు సైకిల్‌పై బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ భారత్’ పిలుపుతో స్ఫూర్తి పొంది ఈ యాత్ర చేపట్టారు.
ఈ నెల 22వ తేదీన భీమవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రారంభమైన యాత్రలో భాగంగా బుధవారం వరంగల్‌కు చేరుకున్న విజయలక్ష్మికి ఈగల్ టీమ్ డీఎస్పీ రమేష్, పలువురు పోలీసు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులతో సమావేశమై మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.
అనంతరం వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసి తన యాత్ర లక్ష్యాలను వివరించారు. డిసెంబర్ 10న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి యాత్ర ఉద్దేశాన్ని వివరించడంతోపాటు, మార్గమధ్యంలో లక్ష మంది విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నది తన సంకల్పమని తెలిపారు. విజయలక్ష్మి చేస్తున్న సామాజిక చైతన్య యాత్రను పోలీస్ కమిషనర్ అభినందించి, జెండా ఊపి తదుపరి ప్రయాణానికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీలు డేవిడ్ రాజ్, సదయ్య, పలువురు ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

