కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) ప్రక్రియను వేగవంతం చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం రాజాపూర్ (Rajapur) మండలంలోని రాజాపూర్, చిన్నవెల్లి గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ సందర్శించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం పరిమాణం, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. నిల్వలో ఉన్న ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే చర్యలలో భాగంగా ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. అదేవిధంగా రవాణా కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన అధికారులు, అదనపు లారీలను అత్యవసరంగా ఏర్పాటు చేసి ధాన్యం తరలింపును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న మొత్తం ధాన్యాన్ని వచ్చే మూడు రోజులలో పూర్తిస్థాయిలో తరలించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు తెలిపారు.
Read Also: హైదరాబాద్‌లో నేపాలీల ఆగడాలు.. యువతి చేయి పట్టి
Read Also: పిల్లల్ని కనడం లేదు

