కలం, మెదక్ బ్యూరో: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ( Sunitha Laxma Reddy) తీవ్రంగా ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఎరువులు, విత్తనాల కోసం, పండించిన పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

