ఇటీవల రోడ్డు ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వరస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణనష్టం కూడా పదుల సంఖ్యలో ఉంటున్నది. ఇదిలా ఉంటే తాజాగా ఒక పెను ప్రమాదం తప్పింది. ఏపీలోని మన్యం(Manyam) జిల్లాలో గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి ఒడిశా(Odisha)లోని జైపూర్ వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోలే బస్సు మంటలకు ఆహూతైంది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఎలా జరిగింది ప్రమాదం?
ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎఎస్ ఆర్టీసీ)కి చెందిన బస్సు బుధవారం రాత్రి విశాఖపట్నం నుంచి బయలుదేరి జైపూర్ వైపు వెళ్తోంది. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బస్సు మన్యం(Manyam) జిల్లా పార్వతీపురం(Parvatipuram) సమీపంలోని గొర్లకొట్టా ప్రాంతానికి చేరుకుంది. అదే సమయంలో బస్సు ఇంజిన్ భాగం వద్ద నుండి ఒక్కసారిగా పొగలు ఎగసిపడడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు.
డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాహనాన్ని రోడ్డుకు పక్కన నిలిపి, ప్రయాణికులను వెంటనే బస్సు దిగమన్నాడు. మంటలు క్రమంగా పెరగడంతో అందరూ బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. వారంతా బయటకు వచ్చి కొద్ది సెకన్లు గడవక ముందే మంటలు మొత్తం బస్సును ఆవరించాయి. కేవలం పది నిమిషాల్లోనే ఆ బస్సు మంటల్లో కాలిపోయింది.
ప్రాణ నష్టం లేకపోవడం అదృష్టం
ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు చెందిన సామగ్రి చాలావరకు మంటల్లో కాలిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బస్సు చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దఎత్తున ప్రజలు గుమికూడి ఘటనను తిలకించారు. ఘటనపై పార్వతీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Read Also: ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు
Follow Us on: Youtube

