కలం, వెబ్ డెస్క్ : మనం ఎక్కువగా హెయిర్ కేర్ అంటే ఖరీదైన షాంపూలు, సిరమ్స్ వాడటం మాత్రమే అనుకుంటాం. కానీ పొడవైన, మృదువైన, ప్రకాశవంతమైన జుట్టుకు నిజమైన మందు మన వంటింట్లోనే ఉందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ (Rujuta Diwekar) తెలిపారు. జుట్టు ఆరోగ్యంగా (Healthy Hair) ఉండాలంటే బయట వాడే ప్రోడక్ట్స్ కన్నా, మనం లోపలికి తీసుకునే ఆహారమే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. శరీరంలో పోషకాల లోపం మొదట జుట్టుపైనే కనిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో అనేక విషయాలను వివరించారు.
ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు లేని ‘నో-కార్బ్’ (Zero Carb) డైట్ జుట్టును దారుణంగా దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. ఖరీదైన సూపర్ ఫుడ్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదని, మన వంటింట్లో ఉండే వస్తువులే జుట్టును కాపాడుతాయని పేర్కొన్నారు. అన్నం తినడం వల్ల శరీరానికి స్థిరమైన శక్తి అందుతుంది. అది జుట్టు పెరగడానికి ఎంతో సహాయపడుతుందని రుజుతా వెల్లడించారు. అలాగే సీజనల్ పండ్లలో ఉండే విటమిన్-సి (Vitamin C) వల్ల శరీరంలో ఐరన్ పెరిగి, రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయని అన్నారు. దీనివల్ల జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా మెరుగై జుట్టు దృఢంగా మారుతుందని తెలిపారు.
మనం రోజూ తీసుకునే పెసలు, కందులు, బొబ్బర్ల వంటి పప్పు ధాన్యాలలో ఉండే ఎమినో యాసిడ్స్, విటమిన్-బి వల్ల జుట్టు చిట్లడం తగ్గుతుందని ఆమె వివరించారు. వీటితో పాటు హలీమ్ (గార్డెన్ క్రెస్) గింజలను లడ్డూలు లేదా పాయసం రూపంలో తీసుకోవాలని సూచించారు. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ చర్మం, జుట్టుకు మేలు (Healthy Hair) చేస్తుందని చెప్పారు. ఆహారంతో పాటు బాహ్య సంరక్షణ కూడా ముఖ్యమేనని ఆమె గుర్తుచేశారు. వారానికోసారి నూనెతో మసాజ్ చేసుకోవడం, క్రమం తప్పకుండా జుట్టు దువ్వుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుందని తెలిపారు.
Read Also: ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.. నిర్లక్ష్యం చేయొద్దు !
Follow Us On : WhatsApp

