కలం, వెబ్‌డెస్క్: ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు (North India Floods) అతలాకుతలం చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన కుండపోత వర్షాలు, క్లౌడ్ బరస్ట్ లు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతవగా, భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఎగువ వాయుగుండాల ప్రభావంతో మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా కనీసం 11 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. పలుచోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోగా, రహదారులు దెబ్బతిన్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యం, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను పెహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించుకొని జమ్మూకు చేరుకొని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి అనేక వాహనాలు కొట్టుకుపోగా, రహదారులు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు, వంతెనలు కూడా దెబ్బతినడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.
నాగాలాండ్‌లో 8 మంది మృతి
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ లు , ఆకస్మిక వరదల కారణంగా కనీసం 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయపడ్డారు. ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో 84 రహదారులు, అందులో రెండు జాతీయ రహదారులు మూసుకుపోయాయి. 10 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. కేదార్‌నాథ్, కైలాస్-మానస సరోవర్ యాత్రలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతంలో మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

