కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని సాగు నీటి కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసి.. అధిక వడ్డీ, రుణ భారం నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సరికొత్త ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ల ఆధీనంలో వినియోగంలో లేని లేదా అనువైన భూములను సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం లీజుకు ఇవ్వడంపై ఆలోచనలు చేస్తున్నది. కార్పొరేషన్లే స్వయంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్థిర ఆదాయాన్ని సమకూర్చుకునే నమూనాపైనా దృష్టి సారించింది. ఈ ఆదాయంతో రుణాల అసలు, వడ్డీ చెల్లింపులు చేస్తూ కార్పొరేషన్లను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సాగునీటి శాఖ ఆర్థిక పరిస్థితి, కార్పొరేషన్ల నిర్వహణపై ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘పది రోజుల్లో సమగ్ర ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కార్యాచరణ (ఫండింగ్ రోడ్‌మ్యాప్) సిద్ధం చేయండి. రుణాల పునర్ వ్యవస్థీకరణ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక నిధుల సమీకరణ, కొత్త ఆదాయ వనరుల గుర్తింపుపై సమగ్ర నివేదిక ఇవ్వండి. ఇందుకోసం అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సేవలను వినియోగించుకోండి” అని అధికారులకు సూచించారు.
సొంత ఆదాయంపై ఫోకస్
ప్రస్తుతం సాగునీటి కార్పొరేషన్లు ప్రభుత్వ బడ్జెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సొంత ఆదాయ వనరులు పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే కార్పొరేషన్లకు చెందిన ఖాళీ భూములను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ప్రతిపాదనపై చర్చించారు. కార్పొరేషన్లే స్వయంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం లేదా ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చి ఆదాయం పొందడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నిజాంసాగర్‌తో పాటు ప్రధాన జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అయితే ఈ కొత్త ఆదాయ విధానం వల్ల రైతులపై ఎలాంటి అదనపు భారం పడకూడదని స్పష్టం చేశారు. చట్టపరమైన, నియంత్రణాపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నమూనా రూపొందించాలని సూచించారు.
15 రోజుల్లో ఆస్తుల డేటా
భారీ పెట్టుబడులు అవసరమయ్యే ప్రాజెక్టుల కంటే, తక్కువ నిధులతో త్వరగా పూర్తి చేయగలిగే ప్రాజెక్టులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. అలాంటి ప్రాజెక్టులు పూర్తయితే తక్షణ సాగునీటి ప్రయోజనాలు అందడంతో పాటు కార్పొరేషన్ల పనితీరు, ఆర్థిక విశ్వసనీయత కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న చట్టబద్ధ ఆడిట్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. ఐదేండ్లుగా (2022–23) పెండింగ్‌లో ఉన్న వార్షిక ఆడిట్లను వెంటనే పూర్తి చేయాలని, ఆడిటర్ల నియామకం, డ్రాఫ్ట్ నివేదికల పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
పారదర్శక ఆర్థిక నివేదికలు సిద్ధమైతే తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు పొందడం సులభమవుతుందని చెప్పారు. సాగునీటి శాఖకు చెందిన అన్ని భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటి లొకేషన్, యాజమాన్య హక్కులు, వాణిజ్య వినియోగ అవకాశాలతో కూడిన సమగ్ర డేటాబేస్ రూపొందించాలన్నారు. భవిష్యత్‌లో వనరుల సమీకరణకు ఈ సమాచారం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
రుణభారం తగ్గించే కసరత్తు
= సాగునీటి కార్పొరేషన్లు ప్రస్తుతం సగటున సుమారు 11% వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నాయని సమావేశంలో మంత్రికి అధికారులు వివరించారు.
= వడ్డీ రేటును సుమారు 8.4 శాతానికి తగ్గించగలిగితే ఏటా దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
= రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
= పెండింగ్ రుణాలు, వడ్డీ రేటు, వార్షిక చెల్లింపులు, ఇప్పటికే చెల్లించిన వడ్డీ, రుణ గడువు, మిగిలిన పనులకు అవసరమయ్యే నిధులు, సమయం.. లాంటి వివరాలు ఉండాలన్నారు.

