కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా నిజాంపేట (Nizampet) మండల కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదని అల్లుడు అత్తగారి ఇంటిని తగల బెట్టాడు. నిజాంపేట గ్రామానికి చెందిన రవి, సాయవ్వకు గత 15 సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య పుట్టింటికి వచ్చింది. కాపురానికి రావట్లేదనే ఆగ్రహంతో అల్లుడు అర్ధరాత్రి అత్తగారి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అర్ధరాత్రి ఘాడ నిద్రలో ఉన్న అత్తగారి కుటుంబ సభ్యులు నిప్పులు చెలరేగడం గమనించి పరుగులు తీశారు. బామ్మర్ది బైకుకు కూడా రవి నిప్పు పెట్టాడు. మంటల్లో ఇల్లు, బైకు కాలిపోయాయి. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.


