కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్(Nizamabad)కు చెందిన ఉందింటి విపుల్ ఉమీత్ రాజ్ (Vipul Umeeth Raj) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. భారీ స్థాయి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎన్‌సెంబుల్‌లో పాల్గొని ఈ ఘనత సాధించారు. 2026 మే 29, శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ పతకాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని AWE Ministries వ్యవస్థాపకులు బ్రదర్ అనిల్ కుమార్, అలాగే హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు పాస్టర్ ఆగస్టిన్ డండింగి అందజేశారు.
2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ రికార్డు సాధించారు. మొత్తం 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాద్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో 777 మంది ఎంపికై, అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాద్యకారులు ఒకే వేదికపై ప్రదర్శన ఇచ్చిన ఎన్‌సెంబుల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. ఈ అచీవ్ మెంట్ పట్ల కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ హర్షం వ్యక్తం చేశారు. విపుల్ ఉమీత్ రాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

