కలం, ఖమ్మం బ్యూరో: వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగినా, నిబంధనలకు విరుద్ధంగా నంబర్లు ఏర్పాటు చేసుకున్నా ఇకపై ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (Rohith Raju) ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెం (Kothagudem) పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్లు రాసుకున్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఈ తనిఖీలలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 36 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి రూ.7,510 జరిమానా విధించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం (Kothagudem) ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ (SI Praveen Kumar) మాట్లాడుతూ.. ప్రతి వాహన యజమాని నిబంధనల ప్రకారం స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లను వక్రీకరించడం, అంకెలను మార్చడం, స్పష్టత లేకుండా ఉండేలా మార్పులు చేయడం వంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు తమ వాహన పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: పాదయాత్రపై కేటీఆర్ సంచలన ప్రకటన!
Follow Us On: Instagram

