కలం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం వనస్థలిపురంలో ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుకు హైడ్రా (HYDRAA) స్పందించింది. సాహెబ్‌నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Ranganath) నేడు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య గురించి వివరాలు తెలుసుకున్నారు.
1987 నాటి కాలనీ లేఅవుట్‌లో పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన ప్లాట్లను సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్థలంలో అక్రమంగా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కబ్జాదారుల బెదిరింపులకు సంబంధించిన వీడియోలను రంగనాథ్‌కు చూపించారు.
కాలనీవాసుల న్యాయపోరాటానికి హైడ్రా పూర్తిగా అండగా ఉంటుందని కమిషనర్ భరోసా కల్పించారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా రద్దయిన సొసైటీ పేరుతో విక్రయాలు జరిగాయి. దీనిపై కోర్టులో ఉన్న వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు నివేదిస్తామని తెలిపారు. జీ ప్లస్ 1 నిర్మాణ అనుమతి తీసుకుని, ఎలాంటి నిబంధనలు పాటించకుండా నాలుగు అంతస్తులు నిర్మించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రజా ఆస్తులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తమ ఫిర్యాదుపై కమిషనర్ స్పందించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ప్లకార్డులు పట్టుకొని హైడ్రాకు మద్దతు పలికారు. ఈ ఆక్రమణలకు సంబంధించి రికార్డులు, భూ హక్కులు, నిర్మాణ అనుమతులను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు.

