Mobile Popup Ad
Mobile Popup Ad

భారత రాజకీయాలలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం: ఎమ్మెల్యే ధన్‌పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో :  భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని నిజామాబాద్ (Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana)  వ్యాఖ్యానించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ఎమర్జెన్సీ డే’ (Emergency Day) కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు అధికార దుర్వినియోగం జరిగిందని తేల్చిందని తెలిపారు. ఇందిరా గాంధీ ఎన్నికను చెల్లదని ప్రకటించడంతో పాటు ఆరేళ్లపాటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించిందని గుర్తు చేశారు.

అయితే ఆ తీర్పు అనంతరం ఇందిరా గాంధీ రాష్ట్రపతిని కలిసి అంతర్గత భద్రత కారణంగా చూపిస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించారని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కే. అద్వానీ, మొరార్జీ దేశాయ్ తదితరులను వారెంట్ లేకుండానే అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన పత్రికల కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, జర్నలిస్టులను జైళ్లలో నిర్బంధించడం వంటి చర్యలు చేపట్టారని విమర్శించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిర్వహించడం ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛలను హరించారని అన్నారు. అలాగే ఎమర్జెన్సీ కాలంలో నిజామాబాద్ (ఇందూరు) ప్రాంతానికి చెందిన అనేక మంది ప్రజలు కూడా జైలు శిక్షలు అనుభవించారని గుర్తు చేశారు.

ఎమర్జెన్సీ బాధితులకు సన్మానం

ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన నిజామాబాద్ సంఘ్ నాయకులు రాజేశ్వర్, సిలివేరు శ్రీధర్‌లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న అనుభవాలను సభికులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు  బెల్లాల్ శశాంక్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసన్న సత్యపాల్, సుమిత్ర కిషోర్, ప్రసూన శ్రీనివాస్, ఓబీసీ మోర్చా నాయకుడు స్వామి యాదవ్, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>