కలం, ఉట్నూర్ : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాలు ఉట్నూర్ మండలం హీరాపూర్ (పీ) గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పాల్గొని గ్రామస్థులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన నృత్యాలు, వేడుకలను ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Vedma Bojju) మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు పూర్వీకులు అందించిన గొప్ప వారసత్వ సంపద అని, వాటిని కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దండారి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కో బృందానికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

