కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(Nizamabad GGH) సగం పోస్టులు ఖాళీగా ఉండటంతో సరైన సేవలు అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రెండు విడతల్లో ఖాళీలను భర్తీ చేసినా.. నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నర్సింగ్, పారా మెడికల్, క్లాస్–4 విభాగాల్లో మొత్తం 573 పోస్టులకు గాను 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇదీ పరిస్థితి
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 700 పడకలు ఉండగా.. ప్రతిరోజూ సుమారు 2 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. అలాగే 250 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. పలు ముఖ్యమైన విభాగాల్లో రోగుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటోంది. మెడికల్ కళాశాల మంజూరైనప్పుడు 2009లో జీవో 150 ప్రకారం జిల్లాకు 750 పోస్టులను కొత్తగా మంజూరు చేసి, తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ ఆ పోస్టుల్లో కొన్ని భర్తీ కాలేదు. ఫ్యాకల్టీ విభాగంలో 35 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో 57 పోస్టులకు గాను 48, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో 109 పోస్టులకు గాను 14 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్స్ విభాగంలో 23 పోస్టులకు గాను రెగ్యులర్‌గా ఒకరు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. ఫ్యాకల్టీ విభాగంలో మొత్తం 225 పోస్టులకు గాను 92 ఖాళీగా ఉన్నాయి.
రెసిడెంట్ల పోస్టులూ ఖాళీ
సీనియర్ రెసిడెంట్ విభాగంలో 103 పోస్టులకు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన 14 మంది, రెగ్యులర్‌గా 36 మంది పనిచేస్తున్నారు. జూనియర్ రెసిడెంట్ విభాగంలో 18 పోస్టులకు 18 ఖాళీగా ఉన్నాయి. సీనియర్, జూనియర్ రెసిడెంట్లు కలిపి మొత్తం 121 పోస్టులకు గాను 65 ఖాళీగా ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో ఏడు పోస్టులకు గాను ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా.. మిగతా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలోని ముఖ్యమైన మినిస్టీరియల్ స్టాఫ్ విభాగంలో 84 పోస్టులకు గాను 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ విభాగంలో ఎనిమిది పోస్టులకు ఇద్దరు పనిచేస్తుండగా.. ఆరు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ విభాగంలో ఎనిమిది పోస్టులకు ముగ్గురు పనిచేస్తుండగా.. ఐదు ఖాళీగా ఉన్నాయి. స్టెనో విభాగంలో 11 పోస్టులకు 11 ఖాళీగానే ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ విభాగంలో ఆరు పోస్టులకు గాను రెండు ఖాళీగా ఉన్నాయి.
నర్సింగ్ విభాగంలోనూ కొరత
నర్సింగ్ విభాగంలోనూ ఖాళీల కొరత తీవ్రంగా ఉంది. 265 స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను 239 మంది పనిచేస్తుండగా.. 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్‌ఎం పోస్టులు ఏడు ఉండగా.. ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. నర్సింగ్ విభాగంలో మొత్తం 281 పోస్టులకు గాను 249 మంది పనిచేస్తుండగా.. 32 ఖాళీగా ఉన్నాయి. 4వ తరగతి ఉద్యోగుల విభాగంలో మొత్తం 93 పోస్టులకు గాను ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు.
పారా మెడికల్ స్టాఫ్ లేక ఇక్కట్లు
జనరల్ ఆసుపత్రిలో ముఖ్యమైన పారా మెడికల్ విభాగంలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 114 పోస్టులకు గాను 26 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఏడు ఉండగా.. అన్నీ ఖాళీగానే ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్, డిజిటల్ ఇమేజ్ టెక్నాలజీ, టెక్నీషియన్, టెక్నికల్, వార్డు అసిస్టెంట్, శానిటేషన్ సూపర్‌వైజర్, టెక్నీషియన్ విభాగాల్లోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వాలు మారినా.. మారని దశ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి స్థాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలను జిల్లాకు మంజూరు చేశారు. అనంతరం పోస్టుల భర్తీ చేపట్టేందుకు జీవో కూడా జారీ అయింది. అయినా నాటి నుంచి ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి ఎవరూ ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేదని పేర్కొంటున్నారు. ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశాలు కూడా తూతూమంత్రంగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేసి వైద్య, నర్సింగ్, పారా మెడికల్, ఇతర సిబ్బంది కొరతను తీర్చాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

