కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 KFC, డొమినోస్ ఔట్లెట్లపై టీజీ సేఫ్ (TG SAFE) ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. అంతర్జాతీయంగా పేరొందిన ఈ ఔట్ లెట్లలో షాకింగ్ దృశ్యాలను గమనించారు. ఫుడ్ తయారు చేస్తున్న కిచెన్ పరిసరాలు బొద్దింకలు, ఈగలు, దోమలతో నిండిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల వాడకంలో ఎలాంటి నాణ్యత పాటించడం లేదని వెల్లడైంది. గడువు ముగిసిన పదార్థాలను వాడటంతో పాటు ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు అధికారులు వివరించారు. అందులో పనిచేసే సిబ్బంది కూడా ఏమాత్రం శుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు.
9 ఔట్లెట్ల లైసెన్సులు రద్దు..
ఈ నేపథ్యంలోనే 9 ఔట్లెట్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు 8 ఔట్లెట్లకు టీజీ సేఫ్ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. 5 ఔట్లెట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 52 కిలోల మెగ్నిషియం సిండికేట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని నోటీసులు అంటించారు. అంతేగాకుండా, వీటిని వెంటనే స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల జాబితాలో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

