గణపయ్యపూలతో అగరబత్తీల తయారీ

కలం, తెలంగాణ బ్యూరో : నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. నిమజ్జనం తర్వాత చెరువుల్లో పేరుకుపోయే టన్నుల కొద్దీ పూలమాలలు, వ్యర్థాల కథ ఏంటనే ప్రశ్నకు హైదరాబాద్ ఈసారి అద్భుతమైన సమాధానం ఇచ్చింది. పండుగ ముగిశాక ఆ పూలను వృథాగా పారేయకుండా, ఏకంగా 24 టన్నుల పూల వ్యర్థాలను సేకరించి పర్యావరణహిత అగరబత్తీలు(Incense Sticks), ధూప్ స్టిక్స్, సహజ సిద్ధమైన రంగులుగా మార్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.

హైదరాబాద్‌లో సరికొత్త రీసైక్లింగ్ మోడల్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఎక్కడా పర్యావరణానికి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం(Municipal Corporation) వినూత్న ముందడుగు వేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని 45 క్రేన్ పాయింట్లతో పాటు రాజేంద్రనగర్, సరూర్నగర్, ఉప్పల్, ఐడీఎల్ చెరువు, బాచుపల్లి చెరువు, ప్రగతినగర్ చెరువుల వద్ద మున్సిపల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది.

విగ్రహాలను క్రేన్ల సహాయంతో నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలోనే.. వాటిపై ఉన్న పూలమాలలు, అలంకరణలను సిబ్బంది విడిగా సేకరించి ప్రత్యేక సంచుల్లో భద్రపరిచారు. ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహానికి సమర్పించిన భారీ పూలమాలను సైతం ఈ రీసైక్లింగ్ (Recycling) ప్రక్రియ కోసమే మున్సిపల్ బృందాలు ప్రత్యేకంగా సేకరించడం విశేషం.

24 టన్నుల పూల వ్యర్థాలు..

ఈ భారీ సేకరణ ప్రక్రియను మూడు మున్సిపల్ కార్పొరేషన్లు సమన్వయంతో చేపట్టాయి. మొత్తం సేకరించిన 24 టన్నుల పూల వ్యర్థాలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధి నుంచి సింహభాగంగా 11.5 టన్నుల పూలు వచ్చాయి. అలాగే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) నుంచి 6.5 టన్నులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధి నుంచి మరో 6 టన్నుల పూలమాలలను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించారు.

రసాయనాలు లేవు.. అంతా సహజసిద్ధం

సేకరించిన పూలను సుగంధభరితమైన ఉత్పత్తులుగా మార్చేందుకు మొదటగా పూలను నీటితో శుభ్రంగా కడిగి, సూర్యరశ్మిలో ఎండబెడతారు. ఆ తర్వాత ఎండిన పూల నుంచి కాడలను, రేకులను కార్మికులు చేతులతో వేరు చేస్తారు. ఆ రేకులను యంత్రాల సహాయంతో మెత్తటి పొడిగా మారుస్తారు. ఈ సహజసిద్ధమైన పూల పొడిని బేస్గా చేసుకుని ఎలాంటి రసాయనాలు వాడకుండా నిత్య పూజల్లో ఉపయోగించే ధూప్ స్టిక్స్, సువాసనలు వెదజల్లే అగరబత్తీలు, పండుగ రంగులను నిపుణులు తయారు చేస్తున్నారు.

స్థానిక మహిళలకు ఉపాధి

నిమజ్జనం తర్వాత సేకరించిన 24 టన్నుల పూల వ్యర్థాలను రీసైకిల్‌ చేసే బాధ్యతను ‘పక్కా ఆర్గానిక్స్‌’ అనే పర్యావరణహిత స్టార్టప్‌ సంస్థకు అప్పగించారు. వివిధ నిమజ్జన కేంద్రాల నుంచి మున్సిపల్‌ సిబ్బంది సేకరించిన పూలమాలలను సంస్థ బృందం ప్రాసెసింగ్‌ కేంద్రాలకు తరలించి, అక్కడ వాటిని అగరబత్తీలు , ధూప్స్టిక్స్‌, సహజ రంగులుగా మార్చుతున్నది.

ఈ రీసైక్లింగ్‌ ప్రక్రియ పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాలేదు. పూలను శుభ్రపరచడం, ఎండబెట్టడం, కాడలు-రేకులను వేరు చేయడం వంటి పనుల్లో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ఒకవైపు పండుగ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపుతూనే మరోవైపు మహిళా సాధికారతకు తోడ్పడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>