కళ్ల ముందే ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు

కలం, సారంగాపూర్‌: ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ పంట పొలాలకు మాత్రం చుక్క నీరు అందడం లేదు. ఫలితంగా ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. సారంగాపూర్‌ మండలం ఆలూరు, బోరిగాం గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వరి పంటలు సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఎన్నో ఆశలతో సాగు చేపట్టిన రైతులకు చివరి దశలో నీటి ఎద్దడి శాపంగా మారింది.

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాలు అడుగంటడం రైతుల కష్టాలను మరింత పెంచాయి. స్వర్ణ ప్రాజెక్టు (Swarna Project) నుంచి సాగునీరు విడుదల కాకపోవడంతో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు జౌలి కాలువ ద్వారా ఆలూరు, బోరిగాం గ్రామాల చెరువులను నింపి పంటలకు నీరందించాలని రైతులు గత రెండు నెలలుగా జిల్లా కలెక్టర్‌, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.

ప్రస్తుతం వరి పంట పొట్ట, గింజ దశలో ఉందని, ఈ సమయంలో కనీసం ఒక్క తడి నీరు అందించినా పంట చేతికొచ్చే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంటలు ఎండిపోతే అప్పుల భారం తప్ప మరో మార్గం లేదని ఆందోళన చెందుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారని, సాగునీరు అందక తమ పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఎండిపోతున్న వరి పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ. రవికుమార్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, సాగునీటి కొరత, పెట్టుబడుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>