కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో మరో కొత్త స్కీమ్‌కు సీఎం విజయ్ శ్రీకారం చుట్టారు . ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం ‘తాయ్‌మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారపు ఉంగరం) (Gold Ring Scheme) అనే నూతన పథకాన్ని సీఎం విజయ్ మధురైలో నేడు అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు మాతా శిశు సంక్షేమాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం కింద ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు 1 గ్రాము ఉచిత బంగారపు ఉంగరాన్ని బహుమతిగా అందిస్తారు.
బిడ్డ జన్మించిన తర్వాత తల్లి, శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే ఈ ఉంగరాన్ని నేరుగా అందజేసేలా ఏర్పాట్లు చేశారు. 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన అర్హులైన శిశివులకు ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. మొదటి దశలో పంపిణీ కోసం తమిళనాడు ప్రభుత్వం 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసింది. మేనమామ స్థానంలో నిలిచి నవజాత శిశువులకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశంతో సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త స్కీమ్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

