కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ లో ఓ తండ్రికి అనుమానం పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానంతో రెండున్నర నెలల కన్న కొడుకుని హతమార్చాడు ఓ తండ్రి. ఆ బాబు తనకు పుట్టలేదని మనసులో కసి పెంచుకున్నాడు. ముక్కుపచ్చలారని బాలుడిని కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరం అశోక్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే బద్రే ప్రియాంక, ఆమె భర్త యువరాజుకు రెండున్నర నెలల బాబు ఉన్నాడు. తన భర్త యువరాజు తమ మూడు నెలల బిడ్డను తీసుకొని కనిపించకుండా పోయాడని అతని భార్య గురువారం ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం యువరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. తన భార్యపై అనుమానం పెంచుకొని, తమ మూడు నెలల బాబు తనకు జన్మించిన సంతానం కాదని అనుమానం పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
దీంతో ఆ బాబును తీసుకొని నిజామాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని అక్కడే ముళ్ల పొదల్లో దాచిపెట్టినట్లు తండ్రి యువరాజు అంగీకరించాడు. నిందితుడు చూపించిన ప్రదేశంలో కొడుకు మృతదేహాన్ని గుర్తించి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బాబుని అతి కిరాతకంగా హత్య చేసిన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!
Follow Us On: Instagram

