కలం, నిజామాబాద్ బ్యూరో: దొడ్డు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రోడ్డు మీదనే మానవాహారం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, మోపాల్ గ్రామ సర్పంచ్ ధ్యాప రవి, అగ్గు చిన్నయ్యలు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనడంలో విఫలం అయిందని విమర్శించారు. పంట వేసినప్పుడు యూరియా కొరతతో రైతులను ఆగం చేసిన ఈ సర్కార్ చేతికి వచ్చిన పంటను కొనడంలో అరిగోస పెడుతున్నారని అన్నారు. 46 డిగ్రీల ఎండలో ఎన్ని రోజులు రైతులు తమ కుప్పల దగ్గర కాపాల ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాపుల ద్వారా తాము కొనలేక పోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ సర్కార్‌కు చేతకాక పంటలు కొంటలేదని కేంద్ర ప్రభుత్వం అంటుందని, ఒకరి మీద ఒకరు విమర్శలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద నీడ సౌకర్యం, టెంటు వేయడం, నీళ్ల సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నారని దీంతో రైతులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. కొనుగోలు కేంద్రాలలో రైతు ముందు తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించి 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. 2 నుంచి 5 కిలోల తరుగు తాలూపేరున కట్ చేస్తూ రైస్ మిల్లు యాజమాన్యం, కొనుగోలు సంస్థల అధికారులు మిలాఖత్ అయి రైతును నిలువు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. హమాలీలు, గన్ని సంచులు, లారీల కొరతల వల్ల తదితర కారణాలతో కొనుగోలు తీవ్ర జాప్యం జరుగుతుందని, వీటన్నింటినీ చక్క పెట్టకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాగే జాప్యం కొనసాగితే త్వరలోనే పెద్ద ఎత్తున రైతులమంతా కలిసి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడ్డోల్ల గంగాధర్, కెంపు నరేష్, పోతన్న, యెల్లోళ్ల నారాయణ, బంటు గంగాధర్, జక్కు నడపన్న, మమ్మాయి మల్లవ్వ, కెంపు నర్సవ్వ, బి. గంగ సాయిలు, దమ్మడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

