కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) వినాయక్ నగర్‌లోని బస్వా గార్డెన్‌లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్థాయి టైక్వాండో ఛాంపియన్‌షిప్ (Taekwondo Championship) ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను క్యూరోగి, పూమ్సే విభాగాలతో పాటు వివిధ వయస్సు, బరువు కేటగిరీలలో నిర్వహించారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో యూనివర్సల్ టైక్వాండో అకాడమీ, వారియర్స్ అకాడమీ, ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ, అమేజింగ్ టైక్వాండో అకాడమీ తదితర అకాడమీలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా క్రీడాకారులు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారని అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి JC మనోజ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి తమ తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
టైక్వాండో సాధన ద్వారా శరీరాన్ని చురుకుగా, క్రమశిక్షణతో, దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. డిస్ట్రిక్ట్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ నేషనల్ స్థాయి పోటీల్లో కూడా రాణించి మరిన్ని పతకాలు సాధించాలని నిర్వాహకులు మనోజ్ ఆకాంక్షించారు.

