కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ (JNTUH VC) కిషన్ కుమార్ రెడ్డిపై విజేఐటీ (VJIT) ప్రిన్సిపాల్ సృజన, హెచ్ఓడీ అరుణ కుమారి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కళాశాలలో జరగబోయే విద్యార్థుల సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి వీసీ కార్యాలయానికి వెళ్లినప్పుడు, ఆయన మహిళలను కించపరిచేలా, లింగవివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు.
మహిళలు విద్య, ఉద్యోగ రంగాల్లో ఉండకూడదని, ఇంటి పరిధికే పరిమితం కావాలంటూ లింగవివక్ష వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమను బెదిరిస్తూ, ఆహ్వాన పత్రాన్ని చింపేసి చేయి చేసుకునేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వీసీపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా ప్రొఫెసర్లు పోలీసులను కోరారు.

