కరీంనగర్ మెడికల్ కాలేజీకి నిధుల భరోసా

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల (Karimnagar Govt Medical College) విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.1.15 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చొరవతో పనులు (Development Works) వేగవంతమయ్యాయి. మరో 15 రోజుల్లో బాలురు, బాలికల హాస్టళ్లను విద్యార్థులకు అప్పగించనుండగా, ఆరు నెలల్లో కళాశాల నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

విద్యుత్, తాగునీటి వసతులకు నిధులు

విద్యార్థులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఎన్‌పీడీసీఎల్‌కు ప్రభుత్వం రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులను సోమవారం నుంచే ప్రారంభించనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలో విద్యుత్ సదుపాయాల కల్పనకు టీఎస్ఎంఐడీసీ ఈఈ ద్వారా ఎన్‌పీడీసీఎల్‌కు మరో రూ.11.40 లక్షలు కేటాయించారు. దీంతో రెండు కళాశాలల్లో విద్యుత్ పనుల కోసం మొత్తం రూ.30.40 లక్షలు మంజూరయ్యాయి. అలాగే కళాశాలకు శాశ్వత తాగునీటి సరఫరా కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.85 లక్షలు అవసరమని అధికారులు గుర్తించారు. గత వారం పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టారు.

15 రోజుల్లో హాస్టళ్ల అప్పగింత

ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలురు, బాలికల హాస్టళ్లను మరో రెండు వారాల్లో అప్పగించాలని అధికారులు కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. లిఫ్ట్ సదుపాయంతో పాటు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా హాస్టళ్లలో ఇన్వర్టర్లు, ఏసీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది.

కలెక్టర్, ఆర్డీఓల పర్యవేక్షణ

జిల్లా కలెక్టర్ గతంలో విద్యార్థులు ప్రస్తుతం ఉంటున్న హాస్టళ్లను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విజ్ఞప్తులను కళాశాల ప్రిన్సిపాల్, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న టోకెన్ల అంశాన్ని నివేదించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆదివారం కరీంనగర్ ఆర్డీఓ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌తో కలిసి కళాశాలను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. విద్యార్థుల అవసరాలు, వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, విద్యార్థులు తరగతులకు ఆటంకం లేకుండా ప్రశాంతంగా చదువుకోవాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>