Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యా సంస్థల్లో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు: నిజామాబాద్ సీపీ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని విద్యార్థి సంఘాల వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోని స్కూల్స్, కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (Nizamabad CP) సాయి చైతన్య (Sai Chaitanya) తెలిపారు.

పాఠశాలల్లో ఏవో కొన్ని వసతులు లేవని, పుస్తకాలు అమ్ముతున్నారనే కారణాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సమాచారం వచ్చినట్లు తెలిపారు. విద్యాసంస్థల వారిని ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిసిందన్నారు. ఇలా వివిధ సమస్యలపై విద్యాసంస్థల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.

అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్ బర్దిపూర్ శివారులోని నారాయణ విద్యాసంస్థలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ కుర్చీలు , ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని వెల్లడించారు. అదే విధంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలో శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తూ పిల్లలను భయాందోళనకు గురి చేసి, పాఠశాలలోని కొన్ని వస్తువులను ధ్వంసం చేసిన కారణంగా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ రెండు కేసులలో ఉన్నవారు గతంలో కూడా కేసులు ఉన్నట్లయితే వారిపై అదనపు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సమస్యలపై అధికారులు నిబంధన ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకానీ విద్యార్థి సంఘాల పేరు చెప్పుకొని పాఠశాలలో ఇబ్బందికర వాతావరణ సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు.

చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని విద్యాసంస్థల నిర్వాహకుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్ ప్రకారం.. స్కూల్స్, కాలేజీలు ఎవరు కూడా బంద్ చేయించరాదని, అలా విద్యాసంస్థలను బంద్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>