కలం, వెబ్ డెస్క్ : ఆటో డ్రైవర్‌కు మద్యం తాగించి హత్యచేసి ఆనవాళ్లు తెలియకుండా చేసిన నిందితుని కేసులో నిజామాబాద్ మూడవ అదనపు సెషన్స్ జడ్జి దుర్గాప్రసాద్ సంచలనం తీర్పు ఇచ్చారు. నిందితునికి ఉరిశిక్ష విధించారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నాగారానికి చెందిన కండెల సందీప్ ఆటో లీజుకు తీసుకుని డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 2025 ఫిబ్రవరి 14న ఇంట్లో నుంచి వెళ్లిన సందీప్ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నాగారం సమీపంలో నివసించే బైరగోని సతీశ్ గౌడ్, సందీప్ ఇద్దరు కలిసి వెళ్లినట్టు ఆటో లీజుకు ఇచ్చిన హరికృష్ణ సమాచారం ఇచ్చాడు.
విచారణ అనంతరం పోలీసులు సతీశ్ గౌడ్‌ను నిందితునిగా తేల్చారు. విందు చేసుకుందాం అంటూ సందీప్‌ను ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లిన సతీశ్, అతనికి మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా తగలబెట్టాడు. ఆ తర్వాత మృతుని వద్ద ఉన్న ఆటో, సెల్ ఫోన్ దొంగిలించి హైదారాబాద్‌వైపు పరారయ్యాడు. నిందితుడు గతంలో హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఓ మహిళను కూడా నగల కోసం హత్య చేసినట్టు విచారణలో తేలింది. కాగా, డబ్బులకోసం ప్రాణాలు తీసేందుకు అలవాటు పడిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించినట్లు ఈ కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజిరెడ్డి తెలిపారు.


