Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ రాజకీయాలు: నగేష్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీని తప్పుగా ప్రచారం చేస్తూ బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని నిజామాబాద్ (Nizamabad) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (Katpally Nagesh Reddy) తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన నగేష్ రెడ్డి, మహిళా రిజర్వేషన్ అంశం పేరుతో నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రమే తమ పార్టీకి అభ్యంతరం ఉందని తెలిపారు. ఈ పునర్విభజన ద్వారా ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు 50 శాతం మహిళా రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు.

బీజేపీకి మహిళలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంట్ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని నగేష్ రెడ్డి (Katpally Nagesh Reddy) డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఢిల్లీలో స్పష్టంగా వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగిందని వివరించారు. గతంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ  వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో ఎప్పటినుండో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రయత్నించారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నబీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ పేరుతో కుట్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుతో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని బలహీనం చేసే విధంగా ఉందని కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్‌లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేంద్ర గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: విజయ్ అఫిడవిట్‌లలో తేడాలు.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>