కలం, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాలో చేసిన ఒక్క మెసేజ్ యువకుడిపై కేసు (Instagram DM Case) నమోదుకు కారణమై కోర్టు మెట్లు ఎక్కించింది. కానీ, కోర్టు ఆ కేసును కొట్టేస్తూ కీలక తీర్పునిచ్చింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు తన క్లాస్‌మేట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ ప్రెట్టీ అని మెసేజ్ చేశాడు. ఆ అమ్మాయి తండ్రి ఓ ఐపీఎస్ ఆఫీసర్. ఇంకేముంది ఇన్‌స్టాలో పంపిన ప్రైవేట్ మెసేజ్‌ల ఆధారంగా సదరు యువకుడిపై వేధింపులు, మహిళా గౌరవానికి భంగం కలిగించారనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సదరు యువకుడి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కర్ణాటక హై కోర్టు (Karnataka HC)కు చేరింది. క్లాస్మేట్ అయినంత మాత్రాన అమ్మాయి రూపంపై వ్యాఖ్యానించే హక్కు లేదని, కేసు కొనసాగించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు.
అయితే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ చాట్‌ను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేస్తూ ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. ఇది ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణ మాత్రమేనని, నేటి తరం జెన్ జీ యువత ఉపయోగించే భాషను నేరంగా భావించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందులో వేధింపులు లేదా మహిళ గౌరవానికి భంగం కలిగించే అంశాలేవీ లేవని పేర్కొంది. ఈ కేసును కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా యువకుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్ సహా అన్ని వస్తువులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆదేశించింది.

