బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్ వార్నింగ్

కలం, నిజామాబాద్ బ్యూరో: వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలోనే జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సిలిండర్ బుక్ చేసిన వారికి మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గృహావసరాల సిలిండర్లు పంపిణీ జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) మాట్లాడుతూ.. జిల్లాలో LPG సిలిండర్ల పంపిణీని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే, నిత్యావసర సరకుల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేయించామని.. ప్రస్తుత మార్చి నెలలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఆకస్మిక దాడులు జరిపిన సందర్భంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 156 డొమెస్టిక్ సిలిండర్లను వివిధ వ్యాపార, వాణిజ్య దుకాణాల నుండి స్వాధీనం చేసుకుని వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారని కలెక్టర్ వివరించారు.

అటు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలకు, ఆసుపత్రులకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, అనాథాశ్రమాలకు ఇండెంట్ లు అందిన వెంటనే జాప్యానికి తావు లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు. ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని డీఎంహెచ్​ వో ను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో (Nizamabad) గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎంతమాత్రం లేదని అన్నారు. LPG వినియోగదారులు ఆన్‌లైన్లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని, ఏజెన్సీల వద్దకు, గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ కోరారు. గ్యాస్ బుకింగ్ కోసం సింగిల్ సిలిండర్ కి 25 రోజులు, డబుల్ సిలిండర్ కి 45 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే బుకింగ్ నమోదు నిబంధన అమలులో ఉందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, నిర్ణీత వ్యవధి దాటిన తరువాతనే గ్యాస్ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

Read Also: పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి.. కోమటిరెడ్డికి అర్వింద్ రిక్వెస్ట్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>