విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో :  విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావు లేదని, అలాంటి ఘటనలు పునరావృతమైతే కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా బాధ్యులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్(Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల పదో తరగతి పరీక్షల సమయంలో ఒక ఎస్జీటీ (SGT) ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ, బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నవారు విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించేలా వ్యవహరించడం చాలా శోచనీయమని పేర్కొన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.

అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. ప్రతి నివాస ప్రాంతానికి సరిపడా శుద్ధి జలాలు అందేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలు, చిన్న మరమ్మతులు వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పారు.

అన్ని గ్రామపంచాయతీల పరిధిలో కుళాయి కనెక్షన్లు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై మండల స్థాయి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పురోగతి సాధించేందుకు హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి లబ్ధిదారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>