కలం, నిజామాబాద్ బ్యూరో: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం పట్ల నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ, భీంగల్ (Bheemgal) మండలం ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంగల్ మండలంలోని పల్లికొండ, భీంగల్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కేంద్రంలో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి నిర్లక్ష్యాన్ని కలెక్టర్ తీవ్రంగా తప్పుబట్టారు. నిర్వహణ తీరు ఇలాగే కొనసాగితే కమిషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్‌లో సెంటర్ కేటాయింపును కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడంపై ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ సకాలంలో జరిగేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో రైతులను కలెక్టర్ స్వయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని పరిశీలించి, వేయింగ్ మిషన్ పనితీరును కూడా నిశితంగా గమనించారు.
17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. తరుగు, కోతలు లేకుండా రైతులకు న్యాయం జరగాలని స్పష్టం చేశారు. అలాగే వాతావరణ వివరాలను వెదర్ యాప్ ద్వారా రైతులకు ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు, ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేయాలని, తద్వారా రైతుల ఖాతాల్లో బిల్లులు సకాలంలో జమ అవుతాయని తెలిపారు. తహసిల్దార్‌లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

