Mobile Popup Ad
Mobile Popup Ad

వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సూచించారు. పదవ తరగతిలో వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో రెమిడియల్ క్యాంప్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ లోని శంకర్ భవన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ భేటీ అయ్యారు. ఒకటి, రెండు సబ్జెక్టులలో తప్పిపోయినంత మాత్రాన అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మరో మూడు వారాల వరకు సమయం మిగిలి ఉన్నందున ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలని, శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జీవితంలో ఓటములు ఎదురవడం సహజమేనని, వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు.

ఉన్నత స్థానాలకు చేరాలంటే షార్ట్ కట్స్ అంటూ ఏవీ ఉండవని, విద్యార్థి దశలో కష్టపడితే జీవితం అంతా సుఖ సంతోషాలతో గడపవచ్చని మార్గనిర్దేశం చేశారు. స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సెల్ ఫోన్లను కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కట్టడి చేయాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ల విషయంలో కొంత కటువుగా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు.

సమ్మర్ క్యాంప్ ను సందర్శించిన కలెక్టర్

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి  (Ila Tripathi) సందర్శించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాలలో అందిస్తున్న కోచింగ్ గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేస్తూ, చక్కగా సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ ప్రత్యేకంగా బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్, ఎంఈఓ లు సాయిరెడ్డి, అరవింద్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్న తదితరులు ఉన్నారు.

Read Also: ‘నేపాలీలతో జాగ్రత్త!’.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>