కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్ బుధవారం నారాయణపేట జిల్లాలోని కోస్గి (Kosgi) పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కోస్గి పట్టణంలో కొనసాగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం, సైన్స్ మ్యూజియం, అమృత్ పథకం కింద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు.
సైన్స్ మ్యూజియం నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని, మ్యూజియంలో ఏర్పాటు చేసే పరికరాలు, తదితర వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లోని బిర్లా మ్యూజియం నుంచి అత్యాధునిక సైన్స్ పరికరాలు, ప్రదర్శన వస్తువులను ఇక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారులు ఎన్ శ్రీధర్ కు వివరించారు.
అమృత్ పథకం లో భాగంగా చేపట్టిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ భాస్కర్ రెడ్డి, ఎస్ఈ లు వెంకటేశ్వర్లు, చిన్నారావు, ఈఈ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

