కలం, నిజామాబాద్ బ్యూరో: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector) భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని (Rain Soaked Paddy Procurement) బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని అన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం ఇంకనూ సుమారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
అకాల వర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్, ఉప్లూర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపడం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి, ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియలను పరిశీలించాలని కలెక్టర్ వెల్లడించారు.
తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1967ను సంప్రదించాలన్నారు.

