కలం, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)కు మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) డిమాండ్ చేశారు. నేడు ఎన్టీఆర్ (NTR) జయంతి సందర్భంగా వసంత్ నగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడటం కోసం పార్టీ పెట్టారన్నారు. ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తనకు ఓటు హక్కు రాగానే టీడీపీ సభ్యత్వం తీసుకొని, తొలి ఓటు ఆ పార్టీకే వేశానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థలు దుర్మార్గంగా ఉన్నాయని, వాటిని రద్దు చేసి ఎస్టీ , ఎస్టీ, బీసీలందరికీ న్యాయం చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదలను ఆదుకున్నారని చెప్పారు. తన లాంటి ఎంతో మంది రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సహించారని తెలిపారు.
ఎన్టీఆర్ మహా నటుడు అని, కృష్ణుడు, రాముడు ఎలా ఉంటారో ఎవరూ చూడలేదని, ఎన్టీఆర్ సినిమాల్లో పోషించిన పాత్రలనే చూశామని చెప్పారు. కేపీహెచ్‌బీలో 3 ఎకరాల్లో బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ పేరిట ప్రారంభించిన పాఠశాల భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌దే అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారని విమర్శించారు. కేపీహెచ్‌బీ కాలనీకి కూడా ఎన్టీఆర్ పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారని, ఆయనను అభిమానించే వ్యక్తులు ఎవరూ ఆ పార్టీలోకి వెళ్లొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలు పెట్టి హంగామా చేయడం కాదని, ఎయిర్ పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

