కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో మేడ్చల్ – ముద్‌ఖేడ్ నడుమ రైల్వే డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా నిజామాబాద్ (Nizamabad) లోని కంఠేశ్వర్ కమాన్ రైల్వే వంతెన వద్ద పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు మొత్తం 90 రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో, ఆర్టీసీ బస్సుల మార్గాలను అధికారులు మళ్లించారు. సాధారణంగా ఈ అండర్ బ్రిడ్జి కింద రెండు మార్గాలు ఉంటాయి కాబట్టి, దఫాల వారీగా ఒక వైపు 45 రోజులు, మరోవైపు 45 రోజుల పాటు పనులు నిర్వహిస్తారు. దీనివల్ల ఒక వైపు నుంచి మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి ఆర్మూర్, హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను మాత్రమే దారి మళ్లిస్తున్నారు. ఆర్మూర్ వైపు వెళ్లే బస్సులు బస్టాండ్ సమీపంలోని మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి గుర్బాబాది రోడ్డు మీదుగా కంఠేశ్వర్ బైపాస్ చేరుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆర్మూర్ నుండి నిజామాబాద్ (Nizamabad) నగరానికి వచ్చే బస్సులు మాత్రం యథావిధిగా కంఠేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జి నుంచే వస్తాయి. ఇక హైదరాబాద్ నుండి నగరానికి వచ్చే బస్సులు ధర్మారం (బి), మాధవనగర్ రైల్వే గేట్, పులాంగ్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా నడుస్తాయి. ఇతర ప్రైవేటు వాహనాల రాకపోకలపై ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలు లేవని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ తెలిపారు.
Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?
Follow Us On: Instagram

