కలం, నిజామాబాద్ బ్యూరో : రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ నిజామాబాద్ (Nizamabad) జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తీవ్రవిమర్శలు చేశారు. ‘సీఎం చేతుల మీదుగా నిధులు విడుదల చేశామంటూ షో చేస్తారు.. కానీ రైతుల ఖాతాల్లో డబ్బు పడేది మాత్రం కొన్ని నెలలకు లేదా సంవత్సరాలకు.. ఇదే కాంగ్రెస్ స్టైల్ ప్రచారం’ అని ఆయన దుయ్యబట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు రైతుల భావోద్వేగాలతో ఆడుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమా? అని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్లో ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఘనంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి రూ.12,000కే పరిమితం చేసిందని అన్నారు.
ఎన్నికలపుడు ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి చేయడం కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12,000 ఇవ్వాలని ప్రకటించినా.. అది సకాలంలో, ఒకేసారి రైతుల ఖాతాల్లో జమవుతున్నదా అంటే స్పష్టంగా కాదని.. ఇప్పటికీ నాలుగు సీజన్లకు ఎగ్గొట్టిందని గుర్తు చేశారు. రైతుకు నిజమైన భరోసా అంటే సకాలంలో, పూర్తి మొత్తంలో సాయం అందించడం అని చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆలస్యం, కత్తిరింపులు, ప్రచారం అనే మూడు సూత్రాలతో వ్యవహరిస్తోందన్నారు. ఇది రైతు సంక్షేమం కాదు .. రైతు నిరాశకు దారి తీసే విధానం అన్నారు. రైతుకు అవసరం ఉన్నప్పుడు డబ్బు ఇవ్వాలి గాని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి సౌకర్యంగా ఉన్నప్పుడు కాదు!.. అని చెప్పారు. ఇది రైతు భరోసా కాదు.. రైతులను అప్పుల్లోకి నెట్టే విధానం అని ఆరోపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందు హడావుడి చేయడం సరికాదని తప్పుబట్టారు. ఇది స్పష్టంగా ఎన్నికల స్టంట్ అని, రైతుల బాధలతో రాజకీయ లాభం పొందే ప్రయత్నం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు గౌరవం ఇవ్వడం అంటే సకాలంలో, పూర్తి మొత్తంలో సాయం అందించడమన్నారు. కాంగ్రెస్ చేస్తున్నది రైతు సంక్షేమం కాదు.. ఇది పక్కా రాజకీయ మోసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పబ్లిసిటీ నాటకాలు కట్టిపెట్టి.. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు.. పూర్తి డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, తెలంగాణ రైతాంగం తరఫున బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెబుతారని బీజేపీ జిల్లా (Nizamabad) అధ్యక్షుడు దినేష్ కులచారి జోస్యం చెప్పారు.

