రేషన్ బియ్యం కోసం ఇంతటి సాహసమా? నిర్మల్‌లో ఆదివాసీల దుస్థితి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల కోసం ఆదివాసీలు ప్రాణాలను సైతం లెక్కచేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో యాపలగూడ, వస్పల్లి, నాయకేపుగూడ, రాంనగర్, సత్తుగూడ, దొందూరి, న్యాకేపుగూడ, గోడుగూడ, సుంగూడ, వసుపెల్లి, చాకేరేవు, ఏగులాపూర్, గుమ్మన, ఒడెరా గూడ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండల కేంద్రానికి వెళ్లి రేషన్ సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే ఉప్పొంగి ప్రవహిస్తున్న కడెం వాగును (Kadem Vagu) దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు నాటు పడవలు, తెప్పలను ఆశ్రయిస్తున్నారు. రేషన్ బియ్యం బస్తాలను పడవలపై వేసుకుని ప్రమాదకర పరిస్థితుల్లో వాగును దాటుతూ సరుకులను గ్రామాలకు తీసుకెళ్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవతలి వైపు వెళ్లేందుకు సరైన రహదారి, వంతెన సౌకర్యం లేక గ్రామస్తుల అవస్థలు పడుతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం బయటకు వెళ్లాలన్నా ఇదే వాగును దాటాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భారీగా ప్రవహిస్తున్న నీరు.. మరోవైపు నాటు పడవపై రేషన్ బియ్యం బస్తాలు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ సాహసం చేస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు. ఏళ్లుగా వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదని వారు వాపోతున్నారు.

వర్షాకాలంలో తమ గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కోసం కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుపై శాశ్వత వంతెన నిర్మించడంతో పాటు వర్షాకాలంలో అత్యవసర రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

Also Read : యూపీఐ ఛార్జీలపై ఫోన్ పే కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>