కలం, నల్లగొండ: స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధిలో వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ (NIT Warangal) పరిశోధకులు కీలక విజయాన్ని నమోదు చేశారు. చక్కెర ఆధారిత సేంద్రియ అణువులను ఉపయోగించి యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చి, ఆ విద్యుత్తు సహాయంతో నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను రూపొందించారు. ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ కూడా మంజూరు చేసింది. ఈ పరిశోధక బృందంలో నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన డాక్టర్ రాచమల్ల అరుణ్ కుమార్ కీలక పాత్ర పోషించి, పరిశోధనా పత్రంలో మొదటి రచయితగా నిలిచారు. ఆయనకు మరో ప్రతిష్ఠాత్మక పేటెంట్ దక్కడంపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతికత పనిచేసే విధానం ఇదే..
మన చుట్టూ జరిగే చిన్నపాటి కదలికలు, కంపనలు, రాపిడి వంటి ప్రక్రియల్లో వృథా అవుతున్న యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చే ‘ట్రైబోఎలక్ట్రిక్ నానోజనరేటర్’ సాంకేతికతను ఎన్ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన చక్కెర ఆధారిత నాఫ్తలిమైడ్ అణువులను పత్తి వస్త్రంలోని సెల్యులోజ్ ఫైబర్‌లపై హైడ్రోజన్ బంధాల సహాయంతో క్రమబద్ధంగా అమర్చారు. ఈ మాలిక్యులర్ సెల్ఫ్ అసెంబ్లీ విధానం వలన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. ప్రయోగాల్లో ఈ పరికరం ఏకంగా 364 వోల్టుల విద్యుత్ వోల్టేజ్‌ను, చదరపు మీటరుకు 19.4 వాట్ల పవర్ డెన్సిటీని ప్రదర్శించింది. ఈ విద్యుత్తును వినియోగించి ప్రయోగశాల స్థాయిలో నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని విజయవంతంగా ఉత్పత్తి చేసి చూపించారు.
గతంలోనూ పేటెంట్ మంజూరు..
ఈ పరిశోధన ఫలితాలు 2025 ఆగస్టులో ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘విలే’ ప్రచురించే ‘అడ్వాన్స్డ్ సస్టైనబుల్ సిస్టమ్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల మొదటి రచయితగా, ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్ కరస్పాండింగ్ రచయితగా వ్యవహరించారు. ఇదిలావుంటే.. డాక్టర్ అరుణ్ కుమార్ రాచమల్ల, ప్రొఫెసర్ సుబ్బయ్య నాగరాజన్ బృందం గతంలోనూ చక్కెర ఆధారిత అణువులను ఉపయోగించి వంగే గుణం కలిగిన సేంద్రీయ సెమీకండక్టర్లను అభివృద్ధి చేసింది. 2022లో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రచురించే ‘గ్రీన్ కెమిస్ట్రీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఆ ఆవిష్కరణకు సైతం భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేయడం విశేషం.

