ఉస్మానియా విద్యార్థుల‌ను వెళ్ల‌గొట్ట‌డం దుర్మారం: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: కరెంటు, నీటి సరఫరా బంద్ చేస్తూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ చదువుకుంటున్న నిరుద్యోగ విద్యార్థులను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి వెళ్లిపోండని భయపెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఫైర్ అయ్యారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు అప్పటి ప్రభుత్వం హాస్టళ్లలో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యార్థులను బయటకు పంపించే కుట్ర చేసింద‌న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీకి సంబంధించిన ఈ-1, ఈ-2, డీ వసతి గృహాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. హాస్టళ్లలోనే ఉండి చదువుకుంటామని అధికారులను కోరిన విద్యార్థులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే తామే పోలీస్ స్టేషన్‌కు వస్తామంటూ ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తిండి లేకపోయినా ఉపవాసాలు ఉండి పోరాడిన విద్యార్థులు.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న బెదిరింపు చర్యలకు భయపడరని, వారు కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులని ఆయన తెలిపారు.

ఆనాడు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్ గాంధీ ఆరు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అవసరమైతే ముఖ్యమంత్రిని సైతం మారుస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హాస్టళ్లు మూసివేస్తే ఫంక్షన్ హాళ్లలో విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశామ‌ని, ఇప్పుడు కూడా అవసరమైతే విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లపై ఆలోచిస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాల్లో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయ‌ని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు గ్రామాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదన్నారు. విద్యార్థులను బెదిరించ‌వ‌ద్ద‌ని, స‌ర్కార్ తాటాకు చప్పుళ్లకు విద్యార్థులు భయపడర‌ని స్ప‌ష్టం చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, బీఆర్ఎస్వీ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>