Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

సామాన్యులపై భారం

ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలను ధరల భారంతో నుంచి రక్షించడమే లక్ష్యంగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపును అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్రానికి రూ. లక్ష కోట్ల నష్టం

ఈ డ్యూటీ కోత కారణంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.1 లక్ష కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ఈ చర్య కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర నిర్ణయం అమల్లోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో రవాణా రంగంపై ఉన్న భారం కొంత మేర తగ్గనుంది. ట్రక్కులు, బస్సులు, వాణిజ్య వాహనాల నిర్వహణ వ్యయాలు తగ్గడంతో నిత్యావసర సరుకుల రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయరంగానికి ఊరట

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రైతులపై కూడా తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం కలిగించే అవకాశముంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉండటంతో రైతులకు కొంత మేర లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఇంధన ధరల పెరుగుదలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>