కలం, వెబ్‌డెస్క్: కేంద్రంలోని మోదీ, అమిత్ షా ద్వయం దేశంలోని మరో ప్రతిష్ఠాత్మక సంస్థను అక్రమాలకు కేంద్రంగా మార్చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు పరీక్షలపై ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన మండిపడ్డారు. దాదాపు 18.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా.. వారం రోజులుగా ఓఎస్‌ఎమ్ (OSM), తప్పుడు మార్కింగ్, మూల్యాంకనంలో లోపాలపై ఫిర్యాదులు వస్తున్నా విద్యాశాఖ మంత్రి పట్టించుకోకుండా తన కుర్చీకే పరిమితమయ్యారని విమర్శించారు. తన జవాబు పత్రం తప్పుగా మూల్యాంకనం కావడంపై న్యాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించిన 17 ఏళ్ల విద్యార్థిని ఆదుకోవాల్సింది పోయి.. బీజేపీ ఐటీ సెల్ అతడిని దేశద్రోహి, సోరోస్ ఏజెంట్, డీప్ స్టేట్ అంటూ వేధించడం దారుణమన్నారు.
భవిష్యత్తు కోసం గళమెత్తిన ఒక చిన్నారిని బీజేపీ ప్రభుత్వం దేశద్రోహిగా చిత్రీకరిస్తోందని, మోదీ ప్రభుత్వానికి యువత, జెన్ జీ (Gen-Z) అంటేనే భయమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. యువత తమను ప్రశ్నలు అడుగుతుండటంతో తట్టుకోలేక, ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై ఈ ప్రభుత్వం బురదజల్లుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ, అణచివేస్తోందని ఆరోపించారు. అయితే, ఇదే యువత, ఇదే జెన్ జీ రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ అహంకారాన్ని ముక్కలు చేస్తుందని ఆయన హెచ్చరించారు.

