కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ (Sarangapur) మండలంలో బీజేఎల్పీ నేత, ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించి రూ.1.80 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జామ్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.38 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం నాగాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనం, రూ.20 లక్షలతో మహిళా సమైక్య సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద రూ. 90 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

